‘చక్రి’ గారికి ఘనమైన వేడుకలు..
శత చిత్ర సంగీత దర్శకుడు చక్రి 47వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. చక్రి తమ్ముడు, సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, చక్రి మిత్రులు హాజరయ్యారు. చక్రితో ఉన్న అనుబంధాన్ని యాదికి తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే వంద సినిమాలకు సంగీతం అందించిన చక్రి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. పాట ఉన్నన్నాళ్లు ఆయన మనవెంటే ఉంటారని పేర్కొన్నారు. అన్నయ్య బతికున్నప్పుడు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ గుర్తుకుతెచ్చుకున్నారు. అన్నయ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా ఈసారి జయంతిని తక్కువ మంది సమక్షంలో నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో పేదలకు, పేషెంట్లకు అన్నదానం చేపట్టారు. పండ్లు అందజేశారు. కార్యక్రమంలో దర్శకుడు రమేశ్ గోపి, జేకే మధు, సత్యప్రకాష్, ప్రభాకర్, నిషాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.