చంద్రబాబుపై మండిపడ్డ కొడాలి నాని…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల రూపంలో 90 వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో జమ చేసిందని అన్నారు మంత్రి కొడాలి నాని. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరంతరం ప్రజలకోసం కృషి చేస్తున్న మా ప్రభుత్వం ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించటానికి 1600 కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుక అడుగు వేస్తారంటే ప్రజలు నమ్ముతారా? అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ప్రభుత్వం సీరం ఇన్సుట్యూట్, భారత బయోటెక్ కంపెనీలకు వ్యాక్సిన్ కోసం లేఖలు రాసిందని.. రామోజీ రావు కొడుకు వియ్యంకుడి కంపెనీ, చంద్రబాబు పెట్టానని చెప్పే భారత్ బయోటెక్ మే 4న ఏం సమాధానం ఇచ్చిందో తెలుసా? అంటూ ఆయన ప్రశ్నించారు.
అదేమంటే… కేంద్రం 3లక్ష 43 వేల డోసులే ఇమ్మని చెప్పిందని, 1,20,000 డోసులు ఇచ్చాం… మిగిలినవి త్వరలో ఇవ్వటానికి ప్రయత్నిస్తాం అని చెప్పిందని అన్నారు. అలాగే.. సీరం ఇనిస్టిట్యూట్ 9, 91, 000 డోసులు ఇమ్మని కేంద్రం చెప్పిందని, మే నెలలో ఇవ్వగలం అనుకుంటున్నాం అని వెల్లడించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఏప్రిల్ 24వ తేదీన కేంద్రానికి లేఖ రాశామని.. దమ్ముంటే చంద్రబాబు అకౌంట్ నెంబర్ ఇవ్వాలని అన్నారు. ఆ అకౌంట్ నెంబర్ కు 1600 కోట్లు జమ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. రోజుకు 10 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇప్పించగలిగే సత్తా బాబుకు ఉందా? అంటూ ఆయన సవాల్ విసిరారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇటువంటి దుర్మార్గులను వదిలిపెట్టకూడదని.. ఇంత విపత్తులో ఉన్నప్పుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వాళ్ళను వదలకూడదని విరుచుకు పడ్డారు. వ్యాక్సినేషన్ పూర్తి అయిన తర్వాత ఎన్నికలు పెడదాం అంటే అప్పుడు చంద్రబాబు, నిమ్మగడ్డ ఏం చేశారు? ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతోందని మాట్లాడారని ఇప్పుడు కరోనా వస్తే ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు.