గురుమూర్తి కోసం జగన్ రంగంలోకి..

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే తిరుపతి ప్రచారానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈనెల 14వ తేదీన ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొంటారని తెలుస్తుంది. బహిరంగ సభ ఏర్పాటుకు రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో మైదానాన్ని టీటీడీ వై.వి.సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు.
అదేవిధంగా తిరుపతిలో ప్రచార పర్యటన రూట్ మ్యాప్ ను రెడీ చేసేందుకు పలు ప్రాంతాల్లో ఈ బృందం పర్యటిస్తోంది. తిరుపతిలో తాజా పరిణామాలతో జగన్ ప్రచారానికి రావాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం ఇప్పటివరకు రాలేదు. నిజంగా జగన్ తిరుపతి వస్తే దాదాపు రెండేళ్ల తర్వాత ప్రచారంలో పాల్గొన్నట్లు అవుతుంది. కాగా 2019 ఎన్నికల సమయంలో మాత్రమే జగన్ ప్రచారం చేశారు. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలే గెలుపు బాధ్యత తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.