కేసీఆర్ సభ అంటే చాలు.. కాంగ్రెస్ నేతలకు గుబులు..
తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక అన్ని పార్టీలను కలవరపెడుతుంది. పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్ పోలింగ్ టైం సమీపిస్తున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు బాగా పేలుతున్నాయి. ఘర్షణ వాతావరణం కూడా చోటుచేసుకుంటుంది.
తాజాగా హాలియా మండలం అనుముల గ్రామంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనుమల గ్రామంలో అభ్యర్థి జానారెడ్డి కొడుకుకు టీఆరెస్ కార్యకర్తలకు మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి… కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొదటినుంచి జానారెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని… సీఎం కేసీఆర్ సభ జరగకుండా చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారని అని ఆరోపనాస్త్రాలు సందించారు. ఓటమి భయంతోనే జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారితో గూండాయిజం చేయిస్తున్నారని మండిపడ్డారు. అనుమల, కొత్తపల్లిలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు.
అంతేకాకుండా ఈరోజు జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో కూడా అల్లర్లు సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అదే జరిగితే గులాబీ శ్రేణుల చేతిలో గుణపాఠం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. అనుమలలో పథకం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ గొడవకు దిగిందని ఆరోపించారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ అంటేనే కాంగ్రెస్ నేతలు భయంతో వణికి పోతున్నారని… కేసీఆర్ సభను నిలువరించేందుకే కాంగ్రెస్ గొడవలను సృష్టస్తుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి వివరించారు.