కేటీఆర్ కు కరోనా పై చిరు స్పందన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్కు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. పరీక్షల్లో తనకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ట్విటర్ ద్వారా కేటీఆర్ స్పష్టం చేశారు.
అయితే తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్లోనే ఉన్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా.. కేటీఆర్ కు కరోనా పాజిటివ్ రావటం పట్ల మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ ప్రియమైన కేటీఆర్.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేస్తున్నారు.