కేంద్రం పూర్తిగా గాలికొదిలేసింది : ప్రియాంకా గాంధీ
దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈ తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా గాలికి వదిలేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తోటి వారికి సాయపడదామని వారిని అక్కున జేర్చుకొని సాయం చేద్దామని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆమె ‘మనం అధిగమించగలం’ అనే టైటిల్ తో ఫేస్బుక్లో భావోద్వేగంతో ఓ పోస్ట్ చేశారు. అదేమంటే ‘ ఇది చాలా భాదాతప్త హృదయంతో మీకు చెప్పాల్సి వస్తుంది. మీలో చాలా మంది కొద్ది వారాల్లో తమ ఆత్మీయులను కోల్పోయారని నాకు తెలుసు. అలా ఎంతో మంది కుటుంబసభ్యులు కోవిడ్తో పోరాడుతున్నారు. కొందరు కోవిడ్ భయంతో ఇళ్లకే పరిమితమై పోయారు. ఈ మహమ్మారితో ప్రభావితం కానీ వారెవరూ లేరు. దేశవ్యాప్తంగా ప్రజలు స్వేచ్ఛగా గాలిపీల్చుకొనేందుకు కూడా తీవ్రంగా భయపడుతున్నారు. వైద్య సాయం కోసమో, టీకా తర్వాతి డోస్ కోసమో వేచి చూస్తున్నారు’ అని వెల్లడించారు.
అంతేకాకుండా ఇంకా ఆమె.. ‘ ఇటువంటి నిరాశా సమయంలో మనం బలాన్ని పుంజుకోవాలి. ఇతరులకు చేతనైనంత సాయం చేయాలి. అలుపెరగక, అన్ని కష్టాలను దాటుకుంటూ సంకల్పంతో ముందుకు అడుగువేయాలి. అప్పుడే మనం అధిగమించగలం’ అని ప్రియాంక స్పష్టం చేశారు. అదేవిధంగా ‘ఈ ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా గాలికొదిలేసింది. ఇంతటి విధ్వంసకర సమయంలో ప్రభుత్వం నాయకత్వ, అధికార బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటుందని ఎవరూ అనుకోలేదు. అయినా ప్రజలు నిరాశ పడకూడదు. ప్రతి కష్ట కాలంలో… సాధారణ ప్రజల కోసం నాలాంటి, మీవంటి వారు ముందుకు వస్తారు. మానవత్వం ఎన్నటికీ ఓడిపోదు’ అంటూ ప్రియాంక ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.