కరోనా వల్ల భారత్ తో బంధం మరింత బలపడింది: జో బైడెన్

కరోనా కారణంగానే భారత్ తో అమెరికా బంధం మరింత బలపడిందని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. తాజాగా అమెరికాలో జోబైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందరోజులు పూర్తయింది. దీంతో ఈ సన్నివేశాన్ని పురస్కరించుకొని జోబైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ అనే కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ తో ఈ వందరోజుల్లో ఎలాంటి బంధం బలపడింది అనే విషయాన్ని సుదీర్ఘంగా వివరించారు.
అదేమంటే… వంద రోజుల్లో భారత్ తో బలమైన బంధం ఏర్పడిందని, అందుకు నిదర్శనం ఈ మధ్యనే ప్రధాని మోడీతో తాను మాట్లాడాటం అని స్పష్టం చేశారు. అలాగే అమెరికా సెక్రటరీ అఫ్ స్టేట్, భారత విదేశాంగశాఖ మంత్రి అనేకమార్లు చర్చలు జరిపారని, రెండు దేశాల మధ్య బంధానికి ఇరువురి మధ్య జరిగిన చర్చలే వెల్లడిస్తాయని అన్నారు.
అంతేకాకుండా డిఫెన్స్ సెక్రటరీ భారత్ లో పర్యటించారని ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన చర్చలు జరిగాయని, మైత్రికి ఇవి ఎంతగానో దోహదపడ్డాయని స్పష్టం చేశారు. కరోనా వైరస్ పాండమిక్ కారణంగా కూడా రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడిందని, భారత్ కు సహకరిస్తామని జోబైడెన్ వివరించారు.