కరోనా భయం.. అడవినే ఐసోలేషన్ గా మార్చేశారు…
దేశాన్ని కరోనా వణికించేస్తుంది. ఈ మధ్యనే కాస్త కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా మరణాలు ఎక్కువశాతం సంభవిస్తుండటంతో కరోనా భయం మాత్రం ప్రజల్లో వేళ్లూనుకొని ఉంది. అయితే కరోనా వైరస్ కంటే, ఆ వైరస్ వలన కలిగే భయంతోనే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా సోకితే మరణం తప్పదనే భయంతో దిగులుతో ఎంతోమంది జీవనాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందు పడుతున్న విషయాన్ని నిత్యం చూస్తూనే ఉన్నాం. కరోనా నుంచి కోలుకోవాలి అంటే మొదట మానసికంగా బలంగా ఉండాలి. స్వచ్చమైన వాతావరణం ఉండాలి. అప్పుడు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా వారికి పూర్తి భరోసా అందివ్వాలి.
అదేవిధంగా కరోనా భయం ప్రస్తుతం గ్రామాలను సైతం తీవ్రంగా వణికించేస్తుంది. వైరస్ మహమ్మారి గ్రామల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని యత్నారం అనే అటవిగ్రామంలో మూడు రోజుల వ్యవధిలో 34 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో తమ వలన మిగతా వారికి ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో గ్రామంలోని ఏడు కుటుంబాలకు చెందిన 20 మంది కరోనా బాదితులు అడవినే ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్నారు. అడవిలోనే ఉంటూ అక్కడే వంట చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కాగా ఈ కరోనాకు సంబంధించిన ప్రాథమిక విషయాలపై అవగాహన ఏర్పరచుకొని వాటిని పాటిస్తూ.. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి గ్రామంలోకి వెళ్తామని బాధితులు చెప్తుండటం విశేషం.