కరోనాతో బీజేపీ ఎంపీ మృతి..
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తిరిగి విజృంభిస్తోంది. దేశంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. పూర్తిగా తగ్గింది అనుకుంటున్న సమయంలో తిరిగి మళ్లీ వీరవిహారం చేస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు.
తాజాగా బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ గురుగ్రామ్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో మంగళవారం ఉదయం చికిత్స పొందతూ కన్నుమూశారు. నంద్‌కుమార్ మధ్యప్రదేశ్ ఖండ్వ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో భోపాల్ లో చికిత్స పొందుతున్న ఆయన్ని గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మృత్యువాత పడటంతో బీజేపీ క్యాడర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది.
కాగా జనవరి 11వ తేదీన ఆయనకు కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో చౌహాన్ ను గత కొద్దిరోజులుగా వెంటిలెటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. ఆయన స్వస్థలం నిమార్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలోని షాపూర్. 8 సెప్టెంబర్, 1952లో జన్మించిన ఆయన 1996లో షాపూర్ మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నంద్‌కుమార్ మృతిపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.