కత్తి మహేష్ కోసం ఒక్క వైసీపీ ఎమ్మెల్యే రాలేదు…
టాలీవుడ్ నటుడు, క్రిటిక్, డైరెక్టర్ కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురై, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘కత్తి మహేష్ మరణం ద్వారా ఆయనికి శత్రువులు ఉన్నారని రుజువు అయ్యింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా కారులో ముందు సీట్లో కూర్చున్న కత్తి మహేశ్ చనిపోయాడని… అదే కారులో పక్కనే కూర్చున్న వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదని ఆయన తెలిపారు. ప్రాణహాని లేదని చెన్నైకి తరలించారుని.. కానీ రెండు కళ్ళలో ఒకటి తీసివేస్తామని చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. కళ్ళు తప్ప ఎక్కడా గాయాలు లేనప్పుడు ఎలా చనిపోయారు? అని మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా సమస్య ఉత్పన్నం కానప్పుడు… ఐదు నిమిషాల ముందే ఎలా సమస్య వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రాణహాని లేదంటూనే ప్రాణం ఎలా పోయింది? అంటూ ఆయన అనుమానాలను వ్యక్త పరిచారు. కత్తి మహేష్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి కావాలని కత్తి మహేశ్ బాగా ప్రచారం చేశారని.. తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కత్తి మహేష్ కృషి చేస్తే… ఆయన అంత్యక్రియలకు ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా రాలేదని ఆయన అన్నారు. తాము ఎక్కడైనా కరివేపాకులమే అని దీంతో అర్థమైంది అంటూ మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. కాగా మందకృష్ణ మాదిగ అభ్యర్థనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? కత్తి మహేష్కు మాత్రమే ఎందుకు తీవ్ర గాయాలు అయ్యాయి? అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్రైవర్ను ప్రశ్నించారు. విచారణలో డ్రైవర్ తాను సీట్బెల్ట్ ధరించానని, కత్తి మహేష్ మాత్రం సీట్ బెల్ట్ ధరించలేదని వెల్లడించినట్లు సమాచారం అందుతుంది. మరి ఈ కేసు విచారణలో ముందు ముందు మరెన్ని ట్విస్ట్ లు వెలుగు చూస్తాయో చూడాలి.