ఓటీటీ కంటెంట్ ప్రభుత్వ పర్యవేక్షణపై రాధికా ఆప్టే నో..
ఓటీటీ ప్లాట్ ఫామ్ లో వచ్చే కంటెంట్ పై ప్రభుత్వ పర్యవేక్షణ చేయాలని కొన్ని సంవత్సరాలుగా కొందరు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఓటీటీ కాంటెంట్ విషయంలో కొన్ని నియమ నిబంధనలను విధించింది కూడా. అయితే ఈ అంశంపై ప్రముఖ నటి రాధికా ఆప్టే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఆమె నటించిన ‘స్కేర్డ్ గేమ్స్, ఘోల్, రాత్ అకేలీ హై, లస్ట్ స్టోరీస్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. వీటిలోని కొన్ని సన్నివేశాలపై రకరకాల వివాదాలు కూడా చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో సహజంగానే తాను నటించిన వెబ్ సీరిస్ పై ఇక నుంచి ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని భావించింది రాధికా ఆప్టే.
తాజాగా ఆమె స్పందిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అవసరమని, ఓటీటీ ప్లాట్ ఫామ్ నుండి దానిని లాగేసుకోవాలనుకోవడం భయంకరమైనదని రాధికా ఆప్టే మండిపడింది. ఈ మాధ్యమం ద్వారా ఎన్నో కొత్త ఆలోచనలు ప్రజలకు చేరుతున్నాయని, అలాగే ఎంతో మందికి ఉపాధి కలుగుతోందని రాధికా ఆప్టే స్పష్టం చేసింది. కాగా రాబోయే ఐదారేళ్ళలో ఈ మాధ్యమంలో ఇంకెన్ని మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలని ఆమె చెప్పింది. ఏది ఏమైనప్పటికీ.. అందాల ఆరబోతకు హద్దులు పెట్టుకోని రాధికా ఆప్టే వంటి వారికి కేంద్రం విధించిన సరికొత్త షరతులు కొంత ఇబ్బందిని కలిగించక మానవు అనేది వారి వాదన. మరి చూద్దాం ముందు ముందు ఎలాంటి నియమాలు వెలువడుతాయో.