ఏబీ వెంకటేశ్వరరావు పై విచారణకు సర్కార్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అధికారాన్ని చలాయించిన మాజీ అదనపు డీజీపీ ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణకు ఆదేశించింది సర్కార్. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడి, అప్పటి ప్రతిపక్షాన్ని వేధించేందుకు ప్రయత్నించారని ఆయనపై విచారణకు ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
అయితే విచారణాధికారిగా ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాను నియమించింది ప్రభుత్వం ఆల్ ఇండియన్ సర్వీస్ రూల్స్ 1969 ప్రకారం నిబంధనలకు లోబడి ఆ అధికారి ఆగడాలపై విచారణకు ఆదేశిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నిష్పాక్షికంగా విచారణ కోసం నియమించిన విచాణాధికారి ఎదుట ప్రభుత్వం తరపున తన వాదనలను వినిపించేందుకు న్యాయవాది సర్వ శ్రీనివాసరావు ప్రజెంటింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు.
అదేవిధంగా ప్రభుత్వం విధించిన గడువులోగా విచారణను పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సర్కారు తెలిపింది. తీవ్ర అభియోగాలపై అప్పటి ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.