ఏపీలో మున్సిపోల్స్.. అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ జోరుగా సాగుతుంది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతోన్న ఈ సమయంలో విజయవాడ కార్పొరేషన్లో ఎన్నికల ఏర్పాటు, పోలింగ్ తీరును పరిశీలించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. వివిధ పోలింగ్ బూత్ ల్లో పర్యటించిన ఆయన పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటూ ఓటర్లను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా నిమ్మగడ్డ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల అధికారులందర్నీ క్షేత్ర స్థాయిలోనే ఉండమని ఆదేశించామని తెలిపారు. అధికారులంతా ఎన్నికల పర్యవేక్షణలోనే ఉన్నారని తెలిపిన ఆయన రూముల్లో కూర్చొని పరిశీలించడం కంటే క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తే వాస్తవాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. ఓటర్ స్లిప్పుల పంపిణీతో మెజార్టీ ఓటర్లు సంతృప్తి చెందుతున్నారన్న ఎస్ఈసీ ప్రభుత్వమే ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయడం వల్ల డూప్లికేషన్ తగ్గిందని అన్నారు. కాగా 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఎవరైనా చనిపోయిన వారుంటే గుర్తించిన ఘటనలు కూడా ఉన్నాయని అధికారులు చెప్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించారు.