ఏపీలో పంచాయతీలకు 17 జాతీయ అవార్డులు…
ఆంధ్రప్రదేశ్ కి వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచీ రాష్ట్రానికి పెద్దఎత్తున అవార్డుల పంట పండుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలన పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఏకంగా 17 అవార్డులను గెలుచుకుంది. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు అవార్డులను ప్రదానం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యంగా అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడ్డాయి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఏపీకి 17 అవార్డులు వచ్చాయని.. దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ అని ఆయన వెల్లడించారు. ఈ-గవర్నెన్స్ కింద ఆంధ్రప్రదేశ్కు అవార్డు వచ్చిందని కూడా స్పష్టం చేశారు. గాంధీ స్ఫూర్తితో సీఎం వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని.. ఈ వ్యవస్థ వల్లే మనకు ఈ గవర్నెన్స్ అవార్డు దక్కిందని వివరించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని, గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్లకు అవార్డులు వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కాగా రాబోయే రోజుల్లో మరింతగా సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పెద్దరెడ్డి వివరించారు.