ఏపీకి ఉన్న అతిపెద్ద ఆస్తి వెంకటేశ్వరస్వామి

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. అన్ని పార్టీ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీడీపీలో అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఎన్నికల ప్రచారానికి ముందు స్వామి వారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తుంది. అయితే తిరుపతి లోకసభ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్,నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత,తిరుపతి లోకసభ అభ్యర్థి పనబాక లక్ష్మీతో కలిసి తిరుమలకు చేరుకున్న చంద్రబాబు సంప్రదాయ దుస్తులు ధరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు.
కాగా దర్శనం చేసుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ను విష్ణుమూర్తితో పోలుస్తూ రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై మండపడ్డారు. దేవుడు దేవుడే… మనిషి మనిషే… మనిషి ఎప్పుడూ దేవుడు కాలేడు అంటూ.. మనుషులను దేవుడితో పోల్చడం… దేవుని కంటే గొప్పగా చెప్పడం చాలా దుర్మార్గమని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా తిరుమలలో చాలా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని… పింక్ డైమండ్ మాయం లాంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని మళ్ళీ నియమించడం మంచి సంప్రదాయం కాదని అన్నారు. ఇలాంటి వ్యక్తులను నియమించడం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ధ్వజమెత్తారు.
అదేవిధంగా ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని… రాష్ట్రానికి అంతా మంచి జరగాలని శ్రీవారిని ప్రార్ధించానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికున్న అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి అని.. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చంద్రబాబు నాయుడు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *