ఏడేళ్ల తెలంగాణ బంగారుమయం అయిందా..?
సరిగ్గా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి ఏడేళ్లు పూర్తయింది. 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేసి అసువులు బాశారు. ఎందరో ప్రాణ త్యాగం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ సాధన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ఒత ఉద్యమ నాయకుడిగా, పోరాట యోధుడిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందని ఉద్యమ పార్టీకి ఓట్లేసి తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.
అదేవిధంగా ప్రజారంజక పాలన చూసిన ప్రజలు 2018 వ సంవత్సరంలో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే కూర్చోబెట్టారు. ముఖ్యంగా 1969లో తెలంగాణకోసం ఉమ్మడి రాష్ట్రంలో తొలి ఉద్యమం ప్రారంభమైంది. ఎందరో ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2001 ఏప్రిల్ 21వ తేదీన డిప్యూటి స్పీకర్గా కేసీఆర్ రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణదీక్షకు దిగడంతో ఉద్యమం మరింత ఉధృత రూపాన్ని దాల్చింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకమ్మ సాగర్ వంటి ఎన్నో ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. అభివృద్ధి విషయంలో మిగతా రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతుంది అనడంతో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ సమయంలోనే మిగులు బడ్జెట్ సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొత్తానికి కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం ఏర్పడకుండా రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు ఇస్తున్న సంక్షేమ పాలన సాగిస్తున్నారు అనడంతో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు…