ఎస్ఈసీకి హైకోర్ట్ లో భారీ ఎదురుదెబ్బ

కోర్టులే ఆయన పదవికి ఆయువు పోశాయని, దీంతో తననెవరు ఏమీ చేయలేరని చెప్పుకుంటున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అదే కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సహజంగా తనకు ఇష్టం వచ్చినట్లుగా న్యాయస్థానాలు తనకే అనుకూలం అని విపరీత ఆదేశాలు జారీ చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తాజాగా వచ్చిన రెండు తీర్పులు భారీ ఝలక్ లేనని చెప్పవచ్చు. తన మాట వినకపోతే న్యాయపరంగా చూసుకుంటానని బెదిరింపులకు ఎలక్షన్ కమిషన్ దిగడం దేశంలో ఎక్కడా చూడలేదు. అలాంటి ఎలక్షన్ కమిషన్ కే కోర్టు చెక్ పెట్టినట్లైంది.
తాజాగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు పూర్తయినప్పటికీ పలుచోట్ల పలువురు అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు అనుమతినిస్తూ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపి వేసింది. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఫిర్యాదులు స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును కూడా నిలుపుదల చేయడం విశేషం. అలాగే.. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేయడంతో హైకోర్ట్ లో ఎస్ఈసీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
హైకోర్ట్ లో అందుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కోర్ట్ తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్ చర్యలన్నీ చట్టానికి లోబడి మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. అలాగే.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం వేర్వేరుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
నామినేషన్ల గడువు ముగిసిన తరువాత నామినేషన్ల దాఖలుకు అనుమతిస్తూ ఎన్నికల కమిషన్ ఈ నెల 1వ తేదీన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీకి చెందిన పాపిరెడ్డి మదన్మోహన్రెడ్డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన వి.ఈశ్వరి, కొమ్మినేని అనీష్ కుమార్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించినట్లు ఫిర్యాదులు వస్తే స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ గత నెల 16న జారీ చేసిన ఉత్తర్వులను కూడా పిటిషనర్లు అందులో సవాల్ చేశారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను నిలిపి వేయాలని పిటిషనర్లు కోరారు. అందుకు సంబంధించిన పిటిషన్లను విచారించిన హైకోర్ట్ ఎస్ఈసీ ఉత్తర్వులను నిలుపుదల చేసింది.
అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు పనులను నిలిపివేయాలని కోరుతూ ఎస్ఈసీ ఆదేశాలను కూడా హైకోర్ట్ తోసిపుచ్చింది. వాలంటీర్లు వారి పనులను వారు చక్కగా నిర్వర్తించవచ్చు అని, సెల్ ఫోన్ లు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించడాన్ని కోర్ట్ తప్పుపట్టింది. ఈ డిజిటల్ కాలంలో చేయాలనుకుంటే సెల్ ఫోన్ లు లేకుండా కూడా చేయవచ్చని, నిజంగా ఎవరు దుర్వినియోగం చేస్తున్నారో వారిని శిక్షించాలి తప్ప అలా మొత్తానికి సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకోవాలని చెప్పడం వారి కార్యకలాపాలకు అడ్డుపడటమేనని తేల్చి చెప్పింది హైకోర్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *