ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్…

టాలీవుడ్ లో దివంగత నందమూరి తారక రామారావు అంటే తెలియని వారు ఉండరు. ఎన్.బి.కె. ఫిలిమ్స్ బ్యానర్ పై తొలిసారిగా నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీయార్ బయోపిక్ ను రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఆయనకు అసలు సిసలైన నట వారసుడు అంటే నందమూరి బాలకృష్ణ. ఆయనకు తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ, అభిమానం అంతకు మించి గౌరవం. ఎప్పుడు ఎలాంటి సందర్భం వచ్చినా తన తండ్రిని తనలో చూసుకోవడం ఆయనకు అలవాటు. ఆ మధ్య భీష్మ ఏకాదశికి గతంలో తాను తండ్రిని అనుకరిస్తూ వేసిన భీష్ముడి గెటప్ ను విడుదల చేశారు బాలకృష్ణ. అలానే ఎన్టీయార్ ‘జగదేకవీరుని కథ’లోని శివశంకరీ గీతాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా ఆలపించారు. తాజాగా యన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తండ్రికి నివాళిగా తన గానంతో ‘శ్రీరామదండకం’ విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 8.45కి రాబోతోంది.
అయితే యన్టీఆర్ జయంతి మే 28వ తేదీన ఉదయం 9.44 గంటల తర్వాత బాలకృష్ణ గానం చేసిన ‘శ్రీరామదండకం’ విడుదల కానుంది. యన్టీఆర్ పోషించిన శ్రీరాముని పాత్రల బొమ్మలపై బాలయ్య గానం చేసిన ‘శ్రీరామదండకం’ గద్యం పోస్ట్ చేసి వీడియోను విడుదల చేయనున్నారు. శ్రీరామపాత్రలో అనితరసాధ్యంగా అభినయించిన రామారావు బొమ్మలు, వాటిపై బాలయ్య గానం చేసిన ‘శ్రీరామదండకం’ గద్యం నందమూరి అభిమానులకు ఆనందం పంచునున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది ఇలా బాలయ్య గానంతో ఎన్టీఆర్ జయంతి జరగనుందన్న మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *