ఉపేంద్ర స్టైలే వేరబ్బా… తాజాగా ప్రజలకో లేఖాస్త్రం…
కన్నడ నటుడు ఉపేంద్ర చాలా వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ విభిన్నంగా ఆలోచిస్తుంటారు. అసలు ఉపేంద్ర అంటేనే మనకు ఆయన సినిమాల్లోని విభిన్నత గుర్తుకు వస్తాయి. విపరీతమైన పోకడలతో ఉండే ఆ సినిమాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్య కాలంలో సక్సెస్ దూరమైనా ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పలు సేవాకార్యక్రమాలు చేపడతూ వస్తున్నారు ఉపేంద్ర. ఈ లాక్ డౌన్ తో షూటింగ్ లేక ఖాళీగా ఉన్న ఉపేంద్రకు వింత ఆలోచన వచ్చింది. అలా ఆ ఆలోచన వచ్చిందో లేదో వెంటనే అక్షర రూపం ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అదేమంటే… ఆయన ఓ లేఖ ప్రజలకు రాశారు. దాని సారంశం ఏమిటంటే.. ‘నాకు కర్నాటక సీఎం కావాలని ఉంది. ఎన్నికల్లో పోటీచేస్తే గెలిపిస్తారా? నన్ను గెలిపిస్తే నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాను. సీఎం (కామన్ మ్యాన్) అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తాను. ఖర్చు చేసే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటాను. మీ నిర్ణయమే శిరోధార్యం’ అని ఆ లేఖలో ఉపేంద్ర పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖాస్త్రం వైరల్ గా మారింది. కాగా ప్రస్తుతం ఉపేంద్ర కన్నడ తెలుగు ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఉపేంద్ర లేఖను ప్రజలు సీరియస్ గా తీసుకుంటారా? లేక లైట్ గా తీసుకుని వదిలేస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.