ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రజలనే కొంటుంది: కన్నా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సొమ్మును పప్పుబెల్లాల్లా పంచి పెడుతుంది అని ఆరోపించారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. జగన్ రైతులను గాలికొదిలేశారని.. వ్యవసాయాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. అలాగే రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారని అన్నారు.
అదేవిధంగా సేకరించిన ధాన్యానికి డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదని… మద్దతు ధర కోసం మూడు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నారని అది తుంగలో తొక్కారని అన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పూర్తిగా మరిచిపోయారని.. డ్రిప్ ఇరిగేషన్ గురించి అస్సలు పట్టించుకోవడమే లేదని ఆయన తెలిపారు. ఇంకా అనేక వ్యవసాయ పరికరాలపై కేంద్రం సబ్సిడీ ఇస్తున్నప్పటికీ.. రైతులకు మాత్రం పరికరాలు అందించడం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలని.. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వం రివర్స్ లో వెలుతుందని కన్నా తీవ్రంగా దుయ్యబట్టారు. కాగా ప్రజల సొమ్ముతో ప్రజలనే కొంటున్న ప్రభుత్వం ఇది అని.. ధాన్యం కొనుగోలు చేయాలని.. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.