ఇక డైరెక్ట్ గా గ్రామాలకు ఫ్రీజర్ బాక్సులు: సోనుసూద్
కరోనా విపత్కాలంలో సోనూసూద్ చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రజల ప్రాణాలను కాపాడటమే పరమావధిగా ఆయన పయనం సాగుతుంది. కరోనాతో విధివశాత్తు మృతి చెందిన వ్యక్తుల అంత్యక్రియలకు కూడా గౌరవ ప్రదంగా జరిగేందుకు సోనూసూద్ చేయూతనిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ఎంపిక చేసిన గ్రామాలకు ఆయన మృతదేహాలను భద్రపరిచేందుకు డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఇస్తుండటం ఆయన చూపే మానవత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
అయితే ఈ సేవలో భాగంగా మొదట సంకిరెడ్డి పల్లి, ఆషాపూర్ బోంకూర్, ఓర్వకల్, మద్దికెర వంటి కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు సోనూనూద్ ను ఈ మధ్య కలిసి, తమ గ్రామానికి చెందిన వ్యక్తులు కన్నుమూస్తే… గతంలో సమీప పట్టణాలను నుండి ఫ్రీజర్ బాక్సులను తెప్పించుకుని, సంబంధీకులు వచ్చేవరకూ మృతదేహాలను భద్రపరిచేవారమని, కానీ ప్రస్తుతం అవి లభ్యం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయాన్ని అర్థం చేసుకున్న సోనూసూద్ ఆయా గ్రామాలలో మృతదేహాలను భద్రపరచడం కోసం ఫ్రీజర్ బాక్సులను అందిస్తానని హామీ ఇవ్వడం విశేషం. ఇలాంటి కరోనా కాలంలో ఇప్పటికే వివిధ రకాలుగా సోనూసూద్ చేస్తున్న సాయం వెలకట్టలేనిది. చెప్పటానికి కూడా సాధ్యం కానిది. మరిప్పుడు ఈ సేవలు కూడా సోనూసూద్ అందిస్తుండటంతో ప్రజలనుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.