ఇండియాకు ట్విట్టర్ భారీ విరాళం…

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. రోజుకు మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఇంకా ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో ప్రముఖులు, నటీసటులు, మల్టీనేషనల్ కంపెనీలు భారత్కు అండగా నిలుస్తున్నారు. కరోనాపై భారత్ చేస్తోన్న యుద్ధంలో ప్రపంచంలోని ఇతర దేశాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోని టెక్ దిగ్గజ కంపెనీలు గూగల్, మైక్రోసాఫ్ట్ భారీ మొత్తంలో భారత్కు విరాళాలను ఇస్తున్నారు. తాజాగా కరోనాపై భారత్ చేస్తోన్న యుద్ధంలో ట్విటర్ భారీ విరాళాన్ని ప్రకటించింది. ట్విట్టర్ అధినేత జాక్ పాట్రిక్ డోర్సే సుమారు 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ.110 కోట్ల) విరాళాన్ని భారత్కు అందిస్తున్నట్లు ట్విటర్లో వెల్లడించారు. భారత్లో కోవిడ్-19 ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు ఎన్జీవో సంస్థలకు విరాళాన్ని అందించాడు. ఈ విరాళాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విటర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే ట్వీట్ చేయడం విశేషం.