ఆ టైంలో నన్ను ఎవరూ పట్టించుకోలేదు : అమలాపాల్
సౌత్ ఇండియన్ బ్యూటీ అమలా పాల్ స్టైలే వేరు. తాను అనుకున్నది, తాను మెచ్చిన వాటికోసం ఏమైనా చేస్తుంటుంది. ఎంతవరకైనా వెళ్తుంటుంది. అందుకే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అయితే అమలా పాల్ ఎప్పుడూ వైవిధ్యభరితమైన స్టోరీలను ఎంచుకోవడంతో పాటు తన అందంతో అందరినీ తనవైపుకు మళ్లించుకుంటుంది.
తాజాగా అమలా పాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆమె గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ పెళ్లి అయిన కొన్ని నెలలకే వారి మధ్య విభేదాలు రావడంతో ఏమాత్రం ఆగకుండా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇదే విషయంపై తాజాగా ఆమె స్పందిస్తూ ‘నా డివోర్స్ టైంలో నాకు ఏ ఒక్కరూ సహాయం చేయలేదు సరికదా అందరూ చెప్పే మాటలు ఒత్తిడికి గురి చేసేలా ఉండేవి. నేనే అతడితో ఉండలేనని, విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు చాలా మంది ఫోన్ చేసిన నాకు ఇక కెరీర్ ఉండదని, ఒక్క అవకాశం కూడా రాదని అన్నారు. అలాంటి సమయంలో నా మానసిక స్థితిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు’ అని అమలాపాల్ తెలిపారు.
కాగా అమలాపాల్ తెలుగులో నాయక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ పెట్టకథలులో మీరా ఎపిసోడ్లో అనుమానాస్పద భర్త కారణంగా బాధపడే భార్య పాత్రను పోషించారు.