ఆర్ఆర్ఆర్ కి హైకోర్ట్ షాక్… బెయిల్ పిటిషన్ డిస్మిస్…

ఆంధ్రప్రదేశ్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్ట్ షాకిచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. రఘురామకృష్ణరాజు అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. బెయిల్ కావాలంటే కింది సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
అయితే ఓ ప్లాన్ ప్రకారం ఏపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులను, నేతలను, అధికారును కించపరిచేలా మాట్లాడుతూ, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్ను సీఐడీ ఎఫ్ఐర్లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
కాగా రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్ట్ తీర్పు ఏం వస్తుందా అని తెలుగు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. చివరికి హైకోర్ట్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో ఆయన కింది జిల్లా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారించకుండా అరెస్ట్ చేశారని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు కోర్టు ముందు చెప్పినా.. హైకోర్టు.. మాత్రం జిల్లా కోర్టు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది.