ఆర్ఆర్ఆర్ కంపెనీలపై రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు…!
ఆంధ్రప్రదేశ్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఇప్పటికే పలు దఫాలుగా లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. అలాగే తాజాగా లోక్సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. ఇప్పుడు.. రఘురామకు చెందిన కంపెనీపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు వైసీపీ ఎంపీలు. ఇందు భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు ఆలేఖలో కోరారు. ఇందు భారత్ కంపెనీ రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని లేఖలో పేర్కొన్న ఎంపీలు.. తక్షణమే ఇందు భారత్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా.. కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలని కూడా వివరించారు. అలాగే మోసం చేసిన మొత్తాన్ని డైరెక్టర్ల నుంచి వసూలు చేయాలని కూడా వైసీపీ లేఖలో పేర్కొనడం విశేషం.
అంతేకాకుండా ఇందు భారత్ కంపెనీ వేల కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిందని.. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా జరగడం లేదని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఎంపీలు.. దీనివల్ల ప్రజలకు సంస్థల పైన నమ్మకం పోయే ప్రమాదం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ‘ఇందు భారత్’ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పిఎఫ్ సి, ఆర్ ఈసి, ఐఐఎఫ్ సిఎల్ నుంచి వేల కోట్ల రూపాయలు పొందారని.. రూ.941.71 కోట్ల రూపాయల ప్రజాధనం స్వాహా చేశారని వారి దృష్టికి తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా విద్యుత్ కంపెనీ పేరుతో లోన్లు తీసుకొని నిధులను పక్కదారి పట్టించారని… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 63.46 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని పేర్కొన్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను తీవ్రంగా మోసం చేశారని.. ఇందు భారత్ పవర్ లిమిటెడ్, ఇందు భారత పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ , ఆర్కయి ఎనర్జీ లిమిటెడ్.. డైరెక్టర్లపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలని.. వీరు మరో విజయ్ మాల్యాగా మారే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు.