ఆర్ఆర్ఆర్ ఆరోగ్యం పై ఆర్మీ హాస్పిటల్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటర్ వైద్య పరీక్షలు నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు. ఆ తర్వాత రఘురామకు వైద్య పరీక్షలపై ఓ ప్రకటన విడుదల చేశారు. ముగ్గురు డాక్టర్ల బృందంతో రఘురామ కృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించామని.. హైకోర్టు నామినేట్ చేసిన జ్యుడీషియల్ ఆఫీసర్ సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందని అందులో పేర్కొన్నారు. అలాగే పరీక్షలు మొత్తాన్ని వీడియో తీశామని కూడా తెలిపారు.
అయితే ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు మెడికల్ కేర్లో ఉన్నారని తెలిపిన ఆర్మీ ఆస్పత్రి… సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఇక్కడే ఉంటారని వెల్లడించారు. కాగా కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. జ్యుడీషియల్ ఆఫీసర్ సమక్షంలో నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదకలను సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయన ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న సమయాన్ని కూడా కస్టడీలో ఉన్నట్టుగా భావించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.