ఆనందయ్య కరోనా మందుపై హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా చాలా తీవ్రంగా విజృంభిస్తోన్నవిషయం తెలిసిందే. అయితే ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయడం.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టడంతో.. మందు తయారీ, పంపిణీ ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ సమయంలో చాలా మంది ఆనందయ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆనందయ్యతో మందు పంపిణీ చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఆనందయ్య ఆయుర్వేద మందు కొనసాగించాలని కోరుతూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. అనంతపురానికి చెందిన ఉమామహేశ్వర నాయుడు అనే వ్యక్తి తరపున పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది బాలాజీ. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో.. కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని పేర్కొన్న పిటిషనర్.. ప్రభుత్వం ఈ మందు పంపిణీ నిలిపి వేసిందని.. దీనిపై విచారణ జరపాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఆనందయ్యకు పూర్తిగా భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తాజాగా ఏస్పీతో సమావేశం నిర్వహించిన ఆయన అంతా అనుకూలిస్తే త్వరలోనే మందు పంపిణీ కొనసాగుతుందని వివరించారు.