ఆక్సిజన్ తరలించేందుకు స్పెషల్ రైళ్లు…

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే… కరోనా సెకండ్ వేవ్ దేశంలో కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకీ రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కనీసం బెడ్లు కూడా లేని పరిస్థితి ఎన్నో రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం.
అయితే కరోనా చికిత్సలో ఆక్సిజన్ పాత్ర కీలకంగా మారింది. ఇదిలా ఉండగా ఆక్సిజన్ కొరత ఆస్పత్రులను వేధిస్తోంది. దీంతో.. ఆక్సిజన్ సరఫరాపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయడానికి ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’లను నడుపుతామని రైల్వే శాఖ ప్రకటించింది. కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో.. మెడికల్ ఆక్సిజన్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా ముంబైలోని కలంబోలీ, ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని బొయీసర్ రైల్వే స్టేషన్ల నుంచి రోడ్ ట్యాంకర్లను ఫ్లాట్ వ్యాగన్లపై ఎక్కించి విశాఖ, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారొకు ఈరోజు తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. అక్కడ ట్యాంకర్లలో మెడికల్ ఆక్సిజన్ను లోడ్ చేశాక తిరిగి ప్రయాణమవుతాయి. రైళ్లలో మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాకు గల అవకాశాన్ని పరిశీలించాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఈ మధ్య కేంద్రాన్ని కోరడం జరిగింది. దీనిపై ఆలోచన చేసిన కేంద్రం.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ తరలింపుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.