అశోక్ గజపతిరాజుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…
ఆంధ్రప్రదేశ్ లోని మాన్సాస్ ట్రస్ట్, ఇతర విషయాల్లో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ ప్రభుత్వం మధ్య తీవ్రమైన వివాదం నడుస్తుంది. అయితే ఈ మధ్య వరుస ట్వీట్లతో మూకుమ్మడి దాడి చేస్తున్న సాయిరెడ్డి ఈరోజు మరోసారి అశోక్ గజపతిరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంచయిత గజపతిపై అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చాలా అనాగరికమని… అలాంటి అనాగరికుడుని రాజుగా ఎలా గుర్తిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే కూలింగ్ గ్లాసులలో లోకాన్ని చూసే వాడు ప్రజా సమస్యలు ఎలా తెలుసు కుంటారని కూడా సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
అదేవిధంగా చంద్రబాబు పుణ్యమా అంటూ ఎమ్మెల్యే, మంత్రిగా అశోక్ గజపతిరాజు చలామణి అయ్యారని… సింహాచలం దేవస్థానంలో 10 వేల కోట్లు రూపాయల విలువైన 830 ఎకరాల భూముల లెక్కలు మాయం అయ్యాయని ఆరోపించారు. అసలు దేవుడు సొమ్ము తిన్నవారు ఎవరైనా ఇబ్బందులు తప్పవని… చట్టాన్ని వ్యతిరేకించిన అందరికి శిక్ష తప్పదని విజయసాయిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ఇంకా భూముల రికార్డులు తారుమారు చేశారని రాజులైతే చట్టానికి అతీతులా..? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇది ప్రజాస్వామ్యమా…? లేక అశోక్ స్వామ్యమా…? అని నిలదీసిన ఆయన.. గతంలో ఈవోగా పని చేసిన రామచంద్రమోహన్ హయాంలో 830 ఎకరాలు దేవస్థానం భూమి రికార్డులు తారుమారు చేశారని.. కిందిస్థాయి అధికారి ఎవ్వరి అనుమతి లేకుండా పదివేలకోట్లు రూపాయలు అవినితికి పాల్పాడ్డారని విమర్శించారు. అంతేకాకుండా మహిళా కమిషన్ కు సంచాయిత ఫిర్యాదు చేశారని.. మాన్సాస్ ట్రస్ట్ బైలానే కారణం అయితే.. దాన్ని సమీక్షిస్తామన్నారు. కాగా.. సింహాచలం భూముల అక్రమాలపై చర్యలు తీసుకున్న అధికారులు.. గతంలో ఈవోగా పనిచేసిన రామచంద్రమోహన్ను ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే.