అంతా జారుకున్నా… కమల్ కు సనమ్ దగ్గరై దులిపేస్తుంది…

విశ్వనటుడు కమల్ హాసన్ సొంత పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కు ఈ మధ్య జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2.52 శాతం ఓట్లు రావడంతో ఒక్కొక్కరు ఆయన పంచనుంచి జారుకుంటున్నారు. గత యేడాది కమల్ హాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ చెప్పకనే చెప్పారు. ఇప్పుడు దానిని గుర్తు చేసి కొందరు ఆట పట్టిస్తుంటే… మరోపక్క కమల్ ను నమ్ముకుని పార్టీలోకి అడుగుపెట్టిన చాలామంది బ్యూరోక్రాట్స్ రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారి మౌర్యతో పాటు, ఐఏఎస్ అధికారి సంతోష్ బాబు, పద్మప్రియ, సి.కె. కుమరవేలు, శేఖర్, సురేశ్ అయ్యర్ తదితరులు పార్టీని వీడారు. అసలు విషయం ఏమిటంటే… పార్టీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేంద్రన్ రాజీనామా చేయడం అందరినీ ఆశ్యర్యపరచింది.
అయితే కమల్ ను ఒంటరిని చేసి అంతా వెళ్లిపోతుంటే… కేవలం నటి, బిగ్ బాస్ ఫేమ్ సనమ్ శెట్టి మాత్రం ఆయనకు బాసటగా నిలిచి.. అలా జారుకుంటున్న వాళ్లందరినీ దులిపేస్తుంది. కమల్ హాసన్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచి ఉంటే మీరు ఇలానే ప్రవర్తించేవారా? అని హచ్చరిస్తుంది. వ్యక్తిగత కారణమంటూ ఆ ఒక్క పదాన్ని చెప్పి పార్టీకి రాజీనామా చేయడం అంటే అస్సలు మీకు కృతజ్ఞత అనేది లేదా అంటూ ప్రశ్నిస్తోంది. పార్టీని, కమల్ హాసన్ ను మాత్రమే కాకుండా వీరంతా ఓటు వేసిన ప్రజలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది సనమ్ శెట్టి. కాగా తమ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రచార సమయంలో చెప్పిన ఈ నేతలంతా… ఈరోజు తామంతా ఎందుకు పార్టీకి రాజీనామా చేశారో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని సనమ్ స్పష్టం చేశారు. కమల్ పార్టీకి సనమ్ శెట్టి గత ఎన్నికల్లో ప్రచారం చేయలేదు, కనీసం ఆ పార్టీలో కూడా చేరకపోవడం విశేషం. కాగా ఈరోజు కమల్ హాసన్ కు మద్దతుగా అమ్మడు గళం విప్పడం వెనుక కనిపించని అదృశ్య శక్తులు ఏవో ఉంటాయని కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.